మాదాపూర్ లో ఐటీ ఉద్యోగినిపై అసభ్య ప్రవర్తన.. నిందితుడిని పట్టుకుని కుమ్మేసిన బాధితురాలు!

  • మాదాపూర్‌లో ఐటీ కంపెనీలో పనిచేస్తున్న మహిళ
  • నడుచుకుంటూ వస్తుండగా మెడపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు
  • వెంబడించి పట్టుకున్న మహిళ
తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించి స్థానికుల సాయంతో పోలీసులకు అప్పగించిందో ఐటీ ఉద్యోగిని. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిందీ ఘటన.

 పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌లోని వారాసిగూడకు చెందిన ఓ మహిళ మాదాపూర్‌లోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తోంది. నాలుగు నెలల గర్భిణి అయిన ఆమె గురువారం రాత్రి విధుల్లో ఉండగా 9 గంటల సమయంలో ఆమె భర్త వచ్చాడు. దీంతో ఇద్దరూ కలిసి వైఎస్సార్ చౌరస్తా సమీపానికి వెళ్లి భోజనం చేశారు. అనంతరం భర్త వెళ్లిపోగా, ఆమె నడుచుకుంటూ కంపెనీకి బయలుదేరింది.

ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా ఆమె మెడపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. షాకైన ఆమె తేరుకుని అతడి వంక కోపంగా చూడడంతో అతడు వెనక్కి తగ్గి వెనకడుగు వేశాడు. అయినప్పటికీ వెనక్కి తగ్గని మహిళ అతడిని వెంబడించింది. అతడిని పట్టుకుని నిలదీసింది.

దీంతో అతడు ఆమెపై దాడికి దిగాడు. అయినప్పటికీ ఆమె భయపడకుండా, అతడిపై ఎదురుదాడికి దిగి పిడిగుద్దులు కురిపిస్తూ గట్టిగా కేకలు వేసింది. అవి విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
madapur
IT Employee

More Telugu News